Thursday, November 18, 2010

బుద్ధం శరణం గచ్ఛామి .........(గాంగ్ టాక్ అందాలు2)

(గాంగ్ టాక్ అందాలు) ...తరువాయి భాగం


 మర్నాడు ప్రొద్దున్నే బౌద్ధ క్షేత్రాలు చూడడానికి బయలుదేరాం. గాంగ్ టాక్ లో ముఖ్యంగా చెప్పుకోవలిసింది బౌద్ధ క్షేత్రాలు(Monastries), టిబెట్ కి దగ్గరగా ఉండటం వల్లనేమో అక్కడ మొనాశ్ట్రీస్ ఎక్కువగా ఉన్నాయి.  బుద్ధ గురు "పద్మసంభవ"(గురు రింపోచి అని కూడా అంటారు) ఎనిమిదవ శతాబ్దంలో సిక్కిం ని దర్శించి  నాలుగు దిక్కులలో ధ్యానించినట్లు చెపుతారు.ఆ తరువాత  17 వ శతాబ్దం లో లాసన్ చెంపో(Lhatsun Chenpo), కర్తోక్ రిజిన్ చెంపో(Karthok Rikzin Chenpo),నాదక్ సెంపా చెంపో( Ngadak Sempa chenpo) అనే ముగ్గురు లామాలు నార్బుగాంగ్(Norbugang) వద్ద కలిసి బౌద్ధ క్షేత్రాలు(Buddhist monastries) స్థాపించాలని సంకల్పించారు. లాసన్ చెంపో బౌద్ధ క్షేత్రాలను కట్టించడమే కాక విశ్వవిధ్యాలయాలు కూడా స్థాపించి బుద్ధుని భోధనలను విశ్వవ్యాప్తం చేసారు. సిక్కింలో దాదాపు 200 బౌద్ధక్షేత్రాలున్నాయి. దాదాపు అన్నింటి లోను విద్య, భోధన మరియు వసతి ఏర్పాట్లుంటాయి. ప్రతి చోటా ప్రార్ధనా జెండాలు, ప్రార్ధనా దీపాలు, ధర్మ చక్రాలు, గుహలు, సరస్సులు, జలపాతాలు మరియు స్థూపాలు కనిపిస్తాయి.
బౌద్ధ క్షేత్రాలు లేదా మొనాస్ట్రీలను మూడు రకాలుగా విభజించారు.

1.టాక్ ఫు  2.గొంపా 3.మని లఖాంగ్స్

టాక్-ఫు(Tak-phu)

         టాక్ ఫు అంటే రాతి గుహ లేదా పర్ణశాల అని అనవచ్చు. గాంగ్ టాక్ లో నలుదిక్కులా నాలుగు ముఖ్యమైన ఆశ్రమాలున్నాయి. ఇక్కడ గురు రింపోచి మరియు 
         లాసన్ చెంబో(Guru Rinpoche and Lhatsun Chhembo) ఈ గుహలలో మెడిటేషన్ చేసినట్లు చెపుతారు.

2. గొంపా(Gompa): బౌద్ధ క్షేత్రాలనే గొంపా అని అంటారు. గొంపా అంటే ఏకాంత ప్రదేశం. ఇక్కడ బుద్ధుని భోధనలు నేర్పించడమే కాక బుద్ధుని భోధనలు విశ్వవ్యాప్తం చేస్తారు. ఈ ఆశ్రమాలు  తప్పని సరిగా ఎతైన ప్రదేశాలలో ఉండి ప్రక్కనే సరస్సు ఉండేటట్లు ఏర్పాటు చేస్తారు. అలా వీలు కాని పక్షంలో ప్రధాన ద్వారం తూర్పు ముఖం కలిగి ఉండి జలపాతాల దగ్గర ఏర్పాటు చేస్తారు, ఎందుకంటే పాపాలన్నీ ఆ నీటిలో ప్రక్షాలన జరగాలని, శరీరం లోకి మంచి ప్రవేశించాలని లామాలు భావిస్తారు.

                                              గొంపా లోపలి భాగం  -  రమ్‍టెక్ మొనాస్ట్రీ  -గాంగ్ టాక్3.మని లఖాంగ్స్(Mani Lakhangs): ఇవి గొంపా ల లాగా ఆలయం మరియు బడి కలిసి ఉన్నట్లుగా కాకుండా కేవలం ఆలయం మాత్రమే ఉండి కొందరు బౌద్ధ సన్యాసులచే గ్రామాల్లో స్థానికులకు ధార్మిక సేవలు అందిస్తారు.
పర్వతారోహకులైతే  టాక్ ఫులను చూడటానికి ఇష్టపడతారు.... మేము ఉన్నది రెండు రోజులే కనుక స్థానిక బౌద్ధ క్షేత్రాలు, నాధులా పాస్ మాత్రమే చూసాం. మని లఖాంగ్స్ గ్రామాల్లో ప్రతి సందులోను ఉంటాయి, వీటిల్లోనే అక్కడి ప్రజలు దైనందిక ధార్మిక సేవలందుకుంటారు. మేము చూసిన మొనాస్ట్రీ లని గొంపాలని అంటారు. వాటిల్లో కొన్ని......


ఎంచీ మొనాస్ట్రీ(Enchey Monastry)

గాంగ్ టాక్ లో ఉన్న మొనాస్ట్రీలలో 200 సంవత్సరాల పురాతనమైనది. గాంగ్ టాక్ నుండి మూడు కిలోమీటర్ ల దూరంలో ఉంది. లామ డ్రుప్తాబ్ కార్పో అనే తాంత్రిక గురువుచే మైనామ్ పర్వతం పై ప్రారింభింపబడినది. ఎంచీ మొనాస్ట్రీ టిబెటన్ బుద్ధిజం కి చెందినది. ఇక్కడ అనేక దేవతా విగ్రహాలు, గురు పద్మసంభవ మరియు, గౌతమ బుద్ధుని విగ్రహాలున్నాయి. గోడలపై రంగు రంగుల చిత్రాలు మనల్ని మైమరిపిస్తాయి.

                                                         ఎంచీ మొనాస్ట్రీ                                                            
  

ప్రార్ధనా చక్రం(prayer wheel)

ప్రతి బౌద్ధ క్షేత్రం లోనూ ప్రధాన ద్వారం చుట్టూ ప్రార్ధనా చక్రాలుంటాయి. వీటినే మని చక్రాలని కూడా అంటారు. ఈ చక్రాలని కుడివైపుకి తిప్పుతూ ఒక మంత్రాన్ని జపిస్తూ,తరువాతి చక్రాన్ని తిప్పాలి. ఇవన్నీ ఒకే వైపుకి తిప్పాలి. ఇలా తిప్పటం వల్ల చెడు కర్మ నశించి మంచి కర్మ ప్రవేశిస్తుందని చెపుతారు. ఇది కూడా ఒక తాంత్రిక విద్యే. బౌద్ధంలో ఇటువంటివెన్నో ఉన్నాయి. మన మనస్సుని తదేకంగా లగ్నం చేసి చక్రాన్ని కుడివైపుకి తిప్పుతూ "ఓం మ ని పద్ మె హమ్"(Om Ma ni Pad me Ham)అనే  మంత్రాన్ని ఒక పద్ధతిలో జపిస్తూ వెళ్ళాలి, మరీ వేగంగా కూడా తిప్పకూడదు. దీని వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని, మనలోని అంతఃశక్తులు జాగృత మవుతాయని తెలుస్తుంది. ఈ మంత్రాన్ని గురు అవలోకతీశ్వర ఉపదేశించారు. అందుకేనేమో ఇక్కడి ప్రజలు ఎంతో ప్రశాంతంగా, మర్యాదగా, ఆత్మవిశ్వాసంతో ఉంటారు.

                                                                       ధర్మచక్రాలు - రమ్టెక్ మొనాస్ట్రీప్రార్ధనా దీపాలు(prayer lights)

ఇక్కడ యాక్ వెన్నతో తయారు చేసిన దీపాలను వెలిగిస్తారు. ప్రతి రోజు వేకువనే ఈ దీపాలను వెలిగించి, ఏడు గిన్నెలలో స్వఛ్చమైన నీటిని ఉంచి(వాడుకునే నీరు,త్రాగే నీరు,పువ్వులు,సుగంధం నీరు, పరిమళం,ఆహారం మరియు ధ్వని)తమ తమ ఆరాధ్యదైవాలను ప్రార్ధిస్తారు.నాలుగవ మరియు ఐదవ గిన్నెల మధ్య ఈ నూనె దీపాలనుంచుతారు. ధార్మిక తీర్ధయాత్రలు చేసేటపుడు, ఎవరైనా చనిపోయినపుడు ఈ దీపాలను పెద్ద సంఖ్యలో వెలిగిస్తారు. "తాంత్రిక చక్రసంవర" ననుసరించి వెన్న దీపాలు వెలిగించటం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుందని, కనీసం వంద దీపాలు వెలిగిస్తే గానీ మనలోని అజ్ఞానం తొలగి ధార్మిక విచక్షణ కలుగుతుందని తెలుస్తుంది.

                                                                ప్రార్ధనా దీపాలు
                    ప్రార్ధనా జెండాలు(prayer flags)
గాంగ్ టాక్ లో ప్రతి పర్వత శిఖరం దగ్గర  సరస్సుల దగ్గర, జలపాతాల దగ్గర ప్రార్ధనా జెండాలు కనిపిస్తాయి. వీటిల్లో రెండు రకాలున్నాయి. ఒకటి అడ్డంగా ఉన్నది లుంగ్చా(wind horse), నిలువుగా ఉన్నది డార్చోర్(to increase life,fortune,health,wealth and all sentient beings). లుంగ్ చా ప్రార్ధనా జెండాలు చతురస్రం లేదా దీర్ఘచతురస్రం ఆకారం లో  ఉండి ఒక తాడు లాంటి దానితో  పైనుంచి క్రిందికి గానీ అడ్డంగా కానీ పర్వత శిఖరాలను కలుపుతారు. బౌద్ధ క్షేత్రాలలో, స్థూపాలపైన, ఆలయాలలో ఇవి కడతారు.

                                         లుంగ్చా జెండాలు -- బధాంగ్ వాటర్ ఫాల్స్ - గాంగ్ టాక్ డార్చోర్ లను నిలువుగా ఒక ద్వజస్థంబం లాంటి దానికి కడతారు.


                                                      డార్చోర్ జెండా - గాంగ్ టాక్

ప్రార్ధనా జెండాలు ఐదు రంగులలో ఉంటాయి. నీలం(ఆకాశం), తెలుపు(గాలి), ఎరుపు(నిప్పు), ఆకుపచ్చ(నీరు), పసుపు(భూమి). వీటిని ఐదు శుద్ధ దీపాలలాగా భావించి, ఎడమనుంచి కుడికి ఒక పద్దతిలో కడతారు. వివిధ రంగులు ప్రకృతిలోని పంచభూతాలతో కలిసిచేసె సాధన అంటారు. ప్రార్ధనా జెండాలపై పులి(గాలి), సింహం(భూమి), గరుడ(అగ్ని) మరియు డ్రాగన్(నీరు), గుర్తులు ఉండి మధ్యలో గుర్రం ఉంటుంది. గుర్రం గుర్తు ఎందుకంటే వేగంగా పరిగెత్తి, శక్తిని, అదృష్టాన్ని, సంపదనీ,ఆరోగ్యాన్ని అందిస్తుందనీ భావిస్తారు వీటిని నేలమీద పడేయకూడదు. వీటిని ఒక ప్రత్యేక సమయాల్లో ఎగురవేయాలి.

టిబెటన్ క్యాలెండర్ ననుసరించి ఆఖరి రెండు రోజులలో బౌద్ధ బిక్షువులు పౌరాణిక కధలను తెలియచేసే ఛామ్ అనే మాస్క్ డాన్స్ చేస్తారు.

రమ్ టెక్ మొనాస్ట్రీ(Rumtech Monastry)
గాంగ్ టాక్ కి 24km దూరంలో నాలుగవ చోగ్యాల్ చేత నిర్మింపబడినది. ఆ తరువాత అది భూకంపానికి గురి అయి పాడయి పోతే పదహారవ గ్యాల్వా కర్మప దీనిని పునర్నిర్మించారు. సిక్కిం లోని అన్ని క్షేత్రాల్లోకి ఇదే పెద్దది.  ఇక్కడ టిబెటన్ వర్ణ చిత్ర కళానైపుణ్యం కనిపిస్తుంది. అక్కడ దేవతా విగ్రహాల కళ్ళు విశాలంగా బాగా తెరచి ఉన్నట్లు ఉంటాయి. అదొక ప్రత్యేకమైన ధ్యాన పద్దతి. రమ్ టెక్ మొనాస్ట్రీ లో బౌద్ధ మత శిక్షణ ఇస్తారు. ఇక్కడ నలంద ఇన్‍స్టిస్ట్యూట్ ఫర్ హయ్యర్ బుద్ధిస్ట్  స్టడీస్ లో శిక్షణ పొందిన విద్యార్ధులను మానవసేవకొరకు నియోగిస్తారు. ఈ క్షేత్రంలో ఎంతో ప్రశాంతంగా ఉంటుంది.అనేక దేశాలకు చెందిన  మతపరమైన పురాతన వస్తువులు ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ కూడా సిక్కిం నూతనసంవత్సరానికి(Losoong) రెండు రోజుల ముందు ఛామ్ నృత్యం నిర్వహిస్తారు.

                                                          రమ్ టెక్ మొనాస్ట్రీ - గాంగ్ టాక్లింగ్డమ్ మొనాస్ట్రీ(Lingdum Monastry)
గాంగ్ టాక్ నుండి ఒక గంట ప్రయాణం. బౌద్ధ మతస్థుల కళాకౌశలం, చిత్రాలు, అద్భుతమైన పనితనం ఇక్కడ చూడవచ్చు. జుర్మాంగ్ ఘర్వాంగ్ రింపోచి అధ్వర్యంలో దీనిని స్థాపించారు. అక్కడ కూడా మొదట ప్రార్ధనా చక్రాలు ఉంటాయి,తరువాత మనం లోపలికి వెళితే అక్కడ బౌద్ధబిక్షువులు బౌద్ధ గ్రంధాలు వల్లె వేస్తుంటారు,మధ్య మధ్యలో డమరుకాన్ని మోగిస్తారు. గౌతమ బుద్ధుడి ప్రతిమ ఎంతో అందంగా ఉండి మనల్ని ఆకట్టుకుంటుంది. అది ఖాట్మండు లోని శాక్య కళాకారులచే తయారుచేబడిందట. అక్కడ దాదాపు 300 మంది బౌద్ధ బిక్షువులు శిక్షణ లో ఉన్నారు. వారంతా నాలుగు గంటలకే లేచి, ధ్యానం, బుద్ధుడి బోధనలు చదవటం, గ్రంధాలు వల్లె వేయటం, మరలా సేవ చేయటం చేస్తారు. గోడలమీద రంగు రంగుల చిత్రాలు, పగొడాలు, భవన నిర్మాణ శైలి మనల్ని  ఎంతో ఆకట్టుకుని వెనక్కి తిరిగి చూస్తూనే ఉంటాము.

                                                     లింగ్డుమ్ మొనాస్ట్రీ --గాంగ్ టాక్


                                                  లింగ్డమ్ లోపలి బుద్ధుని ప్రతిమ -  గాంగ్ టాక్


సిక్కింలో ఎన్నో బౌద్ధక్షేత్రాలున్నాయి. అవి చూడాలంటె పది రోజులైనా సరిపోదు. కొన్ని మాత్రమే చూడగలిగాం. ఆ తరువాత గణేష్ టోక్, హనుమాన్ టోక్ చూసాం.
గణేష్ టోక్ నుండి చూస్తే మొత్తం గాంగ్ టాక్ సిటీ అంతా కనిపిస్తుంది. హనుమాన్ టోక్ లో రామాయణ ఘట్టాలన్నీ వివరించే వర్ణచిత్రాలు ఎంతో బాగున్నాయి.
తాషి వ్యూ పాయింట్ నుండి చూస్తే కాంచనగంగా రేంజెస్ బాగా కనిపిస్తాయి. అక్కడే ఉన్న బధాంగ్ జలపాతం చూసాం. అక్కడి జలపాతం దగ్గర నుండి మనకు కదలాలని అనిపించదు. తెల్లగా, పాలనురగల్లాగా, వేగంగా దూకే జలపాతాలని చూస్తే చిన్నపిల్లలమైపోతాం.

                                                            బధాంగ్ జలపాతం   --   గాంగ్ టాక్స్థానికంగా ఉన్న ఫ్లవర్ షో చూసాం. గుత్తులు, గుత్తులుగా ఉన్న లిల్లీ జాతి పుష్పాలు, రోడోడెండ్రాన్‍లు, ఆర్కిడ్ జాతి మొక్కలు, పెద్ద పెద్ద డాలియాలు, హెలికోనియాలు,గులాబీల్లా ఉండి ఇకెబనా ఆర్ట్ లో లాగా ప్రత్యేక పద్ధతిలో గుచ్చినట్లు ఉండే కెమెలియాలు, వ్రేలాడే క్రోటన్ మొక్కలు ఎంతో బాగున్నాయి. సాయంత్రం M.G Marg లో కొన్ని బుద్ధుని విగ్రహాలు, డ్రాగన్ బొమ్మలు కొనుక్కుని డార్జిలింగ్ బయలుదేరాం.
గాంగ్ టాక్ నుండి డార్జిలింగ్‍కి మూడు గంటల ప్రయాణం. ఇది కూడా ఎంతో బాగుంటుంది. మేము షాపింగ్ చేసి తిరిగి వచ్చేసరికి సాయంత్రమైంది. అప్పటికే సిద్ధంగా ఉన్న సుమోలో డార్జిలింగ్ బయలుదేరాం. దారిలో చీకటి పడింది. అక్కడ గూర్ఖాలాండ్ గురించి ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. వాళ్ళు కరెంట్, వాటర్ బిల్లులు కట్టటం లేదట.
అందుకే అక్కడ కరెంట్  లేదు. దారంతా చీకటి, సాధారణంగా మనం కొండలపైన 'U' టర్న్ లు చూస్తాం కదా! కానీ ఇక్కడ రోడ్లు 'S' టర్న్ లు లాగా ఉండి మెలికలు తిరుగుతూ, పొగ మంచుతొ కప్పబడి  డ్రైవర్ వేగంగా దూసుకెళ్తోంటే మనకు చెప్పలేనంత భయం వేస్తుంది. అక్కడ ఉండే వాళ్ళకు ఆ రోడ్లు అలవాటేమో గానీ మాకు మాత్రం మరచిపోలేని ఒక అనుభవం కలిగింది.

గాంగ్ టాక్ తో పోలిస్తే డార్జిలింగ్ అంత అందంగా ఉండదు. నాకు కలకత్తాయే  నిరాశకలిగించిందంటే డార్జిలింగ్ కూడా శుభ్రంగా లేకుండా ఎక్కడ బడితే అక్కడ కరెంట్ తీగలు, రోడ్డు ప్రక్క ఎక్కడ చూసినా నీటి గొట్టాలతో, చెత్త చెదారంతో మళ్ళీ వెస్ట్ బెంగాల్ లోకి ఎందుకొచ్చామా అనిపించింది. తరువాతి రోజు ఘూమ్ మొనాస్టరీ, హిమాలియన్ మౌంటనీరింగ్ ఇన్‍స్టిట్యూట్,జపనీస్ పీస్ పగోడా, చున్ను సమ్మర్ ఫాల్స్, రాక్ గార్డెన్ చూసాం.

                                                     జపనీస్ పీస్ పగోడా -  డార్జిలింగ్అక్కడ నాకు బాగా నచ్చింది టీ తోటలు. ఎంత బాగున్నాయో! మా అబ్బాయి, మావారు ఆ పచ్చని తోటలు చూసి బాగా ఎగ్జైట్ అయిపోయి నేను ఫోటో తీస్తాను అంటే నేను తీస్తాను అని దెబ్బలాడుకుని ఇద్దరూ కలిసి కెమేరా క్రింద పడేశారు. దెబ్బతో కెమేరా పాడయిపోయింది. పాత కొడాక్ కెమేరా వద్దనుకుకుని వచ్చేటపుడు ముచ్చటపడి కొన్నాం. దాని పని అయిపోయింది. గతంలో కాశ్మీర్ కెళ్ళినపుడు కూడా అలాగే టూర్ నుండి ఇంటికి వచ్చి రీల్ కడిగించాలని ఒపెన్ చేసారు. రీల్ గిర్రున బయటికి వచ్చేసింది. ఆగ్రాలో,కాశ్మీర్ లో ఫోటోలు దిగిన గుర్తులు ఏమీ మిగలలేదు. కాని ఇపుడు మెమరీ చిప్ మూలంగా ఫోటోస్ మాత్రం దక్కాయి.

                                                           డార్జిలింగ్ టీ తోటలుఈ మధ్య మన డార్జిలింగ్ టీ కి అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. అక్కడ ఆ నేలలో పండితేనే ఆ టీ కి ఒక రకమైన  మంచి సువాసన ఉంటుందంట. ప్రపంచంలో ఏ తేయాకు తోటలకి డార్జిలింగ్ తేయాకుకున్న డిమాండ్ లేదు. మావారు రెండు మూడు చోట్ల కనుక్కుని టీ ఆకు కొన్నారు.

                                                       టీ గార్డెన్ - డార్జిలింగ్
 మరుసటి రోజు ఉదయం కాంచన గంగా శిఖరంలో  కొండలమధ్య నుండి  కళ్ళు మిరుమిట్లు గొలిపేలా వెండిశిఖరంలాగా  ఉన్న  సూర్యోదయాన్ని  కళ్ళారా చూసి మనసంతా ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపుకుని హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అయ్యాం.

                                               డార్జిలింగ్ నుండి  కాంచన గంగ్ పర్వత శిఖరాలుశంషాబాదు విమానాశ్రయం చేరుకున్నాక అనిపించింది, ఎక్కడ కాంచన గంగ పర్వతశిఖరాలు ఎక్కడ హైదరాబాదు, ఒకేరోజులో రెండిటినీ చూసాం కదా!  ఈసారి సరిగా ప్లాన్ చేసుకుని ఉదయ సంధ్యలో కాంచనగంగ శిఖరాన్ని  చూసి సాయంసంద్యలో కన్యాకుమారి  చూస్తే ఎలా ఉంటుంది అనుకున్నాం. అధ్బుతం కదూ!!! వీలైతే మీరు ప్రణాళిక వేయండి మరి!!!

                                                 రాజీవ్ గాందీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ - శంషాబాద్

4 comments:

Lakshmi said...

నీహారిక గారూ,

పోస్టు కి సంబంధం లేని వ్యాఖ్య చేస్తున్నందుకు క్షమించండి. శరత్ గారి బ్లాగులో మీ కామెంటు చదివాను. నిజం గా మీ ధైర్యానికి జోహార్లు. మీరు ఇక ఇప్పటి నుండీ కొంతమంది కి శత్రువయిపోతారు చూడండి. ఆ హిపోక్రాట్లెవ్వరూ మీ టపాలకి కామెంటరు.

మరో సారి మీ బ్లాగు చదివి కామెంటుతా.

నీహారిక said...

Thanks lakshmi gaaru.

తార said...

ఒహ్ చాలా టపాలు పెట్టారే, హ్మ్, మీ రచనా పద్దతి బాగుంటుంది..
మళ్ళీ వస్తా, మొత్తం చదివి కామెంటుతా..

శేఖర్ said...

photos are nice..