Thursday, February 3, 2011

స్త్రీవాదం v/s పురుషవాదం

ఈ ప్రపంచపు నిఘంటువులలోకెల్లా అత్యంత నిరర్ధకమైన పదాలు ఏవి? అని నన్ను అడిగితే ఈ రెండే అని ఘంటాపధంగా నొక్కి వక్కాణించి మరీ చెపుతాను. ఈ రెండిటిని ఉపయోగించి ఎవరైనా మాట్లాడినా నాకు చిరాకు. వాస్తవానికి ఈ రెండిటి కన్నా మానవతావాదం గొప్పది. ఆ తర్వాతే ఏ వాదమైనా ! మనం ముందు మానవతావాదులం కావాలి.

కొంతమంది స్త్రీలనుద్ధరించాలని , స్త్రీలనుద్ధరించేస్తున్నామని, స్త్రీవాదులమనీ ఎన్నో భూమికలు నిర్వహిస్తూ ఉంటారు. వాస్తవానికి వారు పనిచేసేది స్త్రీలకోసం కాదు. వారి స్వార్ధం కోసం, పేరు కోసం, ఇంకా మాట్లాడితే డబ్బు కోసం మాత్రమే. వారి చూపు ఎప్పుడూ మీడియా మీదనే ఉంటుంది. వీరు చేసే 'సేవ' వాళ్ళు కవర్ చేయాలని తద్వారా వారికి ప్రతిష్ఠ పెరగాలనే తప్ప, వాళ్ళు నిజంగా స్త్రీల గురించి పాటుపడే వాళ్ళయితే ప్రచారాన్ని కోరుకోరు. మీరు ఇటువంటి వాళ్ళను తేలికగా గుర్తించవచ్చు, ఎలాగంటే ఈ తరహా వ్యక్తులు ఎక్కువగా మగవారిలాగా జుట్టు కత్తిరించుకుంటారు. నాకర్ధం గాని విషయం ఏమిటంటే పురుషుల మీద పోరాడాలంటే పురుషులు లాగా మారాల్సిందేనా ?

అసలు స్త్రీ లకోసం ఒక వాదం అవసరం లేదు. స్త్రీకి ఏ పరిస్థితి లో ఎలా వ్యవహరించాలో పూర్తిగా తెలుసు. స్త్రీ ఒక పెద్ద వ్యవహార కర్త. ఒక్క చేతితో ఎన్నో రకాల పనులను, ఎన్నో రకాల మనుష్యుల ,ఎన్నో రకాల సమస్యలను అవలీలగా తీర్చగల సమర్ధురాలు. స్త్రీ అబల అన్నది నిన్నటి మాట ! నేడు స్త్రీ ఒక శక్తి. నిజంగా సమస్యలున్న స్త్రీ ఎన్నడూ ఆలోచనారహితంగా వ్యవహరించదు. గిల్లి కజ్జాలు పెట్టుకోవాలనుకునే స్త్రీలు మాత్రమే స్త్రీ వాదులమని చెప్పుకుంటారు.

స్త్రీల కోసం రిజర్వేషన్లు కావాలి అని అంటున్నారు. స్త్రీ పురుష సమానత్వం కోరుకుంటూ మళ్ళీ ఈ రిజర్వేషన్లు ఎందుకు ? ఏ పురుషుడైనా మాకు రిజర్వేషన్ ఇవ్వండి అని అడుగుతున్నాడా? స్త్రీలు మాత్రం ఎందుకు అడగడం ? ప్రతిభ కలవారిని ఎదగనీయకుండా ఎవరైనా అడ్డుకున్నారా? ఇందిరా గాంధీ లాంటి వారయితే వారసత్వం గా ఎదిగారనుకోండి, రేణుకా చౌదరి, బృందా కారత్, మాయావతి , మమతా బెనర్జీ లాంటి ప్రముఖులందరూ రిజర్వేషన్లు లేకుండానే రాజకీయంగా ఎదిగారు కదా? రాజకీయాలలో స్త్రీల సంఖ్య ఎక్కువగా లేకపోవడానికి కారణం వారిలో నిజమైన సత్తా లేకపోవడం మాత్రమే కారణం. ఎవరైనా అడ్డుపడటం వల్ల మాత్రం కాదు.


ఇక కొంతమంది పురుషులు ఇపుడు కొత్తగా పురుషవాదాన్ని ఎత్తుకుంటున్నారు. వీరు కూడా పురుషహక్కులు అంటూ వాపోతున్నారు. వీళ్ళని గుర్తించడం కూదా తేలికే వీరి తలకి ఒక పిలక ఉంటుంది. అంటే స్త్రీల మీద పోరాడాలంటే స్త్రీలాగా ఒక ' పోనీ ' ఉండాలి అన్నది వీరి సిద్ధాంతం. వీరి వాదన ఎలా ఉంటుందంటే మేము ఎందుకు భార్యా బిడ్డలని పోషించాలి ?మేము ఎందుకు ఇల్లు కొనాలి ? మేము ఎందుకు సంసారం చేయాలి ? మేము వంట ఎందుకు చేయకూడదు ? మేము వ్యభిచారం మాత్రమే ఎందుకు చేయకూడదు ? అంటూ వీరు వితండవాదం చేస్తూఉంటారు. స్త్రీ వాదులు పురుషులని దుయ్యబడుతూ , పురుష వాదులు స్త్రీలను దుయ్యబడుతూ ఉంటారు.

స్త్రీలు , పురుషులు , పక్షులు , జంతువులు ఇలా రకరకాలుగా ఈ సమాజం సృష్టించబడింది. మనకోసం మన పూర్వీకులు ఇలా ఉంటే బాగుంటుందని కొన్ని పద్ధతులు, అచారాలు , ఎవరితో ఎలా వ్యవహరించాలో తెలియజేసేందుకు పరిశోధనలు చేసారు, ఎన్నో మహత్తరమైన, రమణీయమైన గ్రంధాలు వ్రాసారు .వారు రాసిన గ్రంధాలలో అప్పటి కాలమాన పరిస్థితులకు అణుగుణంగా వ్రాసినా , ఏకాలంలోనైనా నిలచిఉండే నీతి సూత్రాలను తెలిపారు. వాటిని స్త్రీ అయినా పురుషుడు అయినా ఆఖరికి జంతువు అయినా ఆచరించి తీరవలసిందే! చిన్నయసూరి కధలలో అయినా, చందమామ కధలో అయినా, మరి ఏ ఇతర కధలో అయినా, నీతిని, ధర్మాన్ని, అహింసనీ, సత్యాన్ని భోధించారు. ఎవరైనా వీటిని అనుసరించి నడువవలసిందే ! ఈ మాత్రం చిన్న విషయం అర్ధం చేసుకోకుండా ఈ వాదాలు అవసరమా ?

మదర్ ధెరిస్సా లాంటి వాళ్ళు ఏమి అశించి సేవ చేసారు ? మేము ఇది చేసాం అని పోస్టులు రాసి ఫోటో వేసుకున్నారా? ఎవరి నుండి మీరు సర్టిఫికేట్ పొందాలని అశిస్తున్నారు ? వాళ్ళు మానవాతీతంగా పనిచేసారు గానీ మాకు మంత్రం దండం దొరికితే బాగుండు అని అనుకోలేదు. వింత ఏమిటంటే ఆ మంత్రందండం సదరు ఆ వ్యక్తులకే పనిచేయాలట ! ఇందులో కూడా స్వార్ధమే ?? వీరిది నిజంగా నిస్వార్ధమే అయితే వారికి దొరికిన మంత్రదండం అందరికీ పనిచేయాలని కోరుకోవాలి కదా ?? ఇక్కడే తెలిసిపోతుంది వారెంత స్వార్ధపరులో !!

మార్పు ఎప్పుడు మొదలయినా దానిని మొదట ఆమోదించినది పురుషుడే . పురుషులు ఏది చేస్తే అది స్త్రీలు చేస్తారు. ఒక తండ్రి ఆమోదం లేనిదే ఒక స్త్రీ చదువుకుని ఉండేది కాదు, ఉద్యోగం చేసిఉండేది కాదు. పురుషుడు ఎపుడైతే ఉద్యోగం చేసే స్త్రీని కోరుకున్నాడో అపుడు ఆ స్త్రీలో స్త్రీ లక్షణాలు ఉండవు. ఆ స్త్రీ పురుష లక్షణాలు సంతరించుకుంటుంది. ఒక పురుషుడికి ఇంకొక పురుషుడిపై ప్రేమ ఎలా కలుగుతుంది?

స్త్రీలు చదవాలి , ఉద్యోగం చేయాలి , జీవితంలో ఏదైనా జరుగ వచ్చు , ఉన్నది ఉన్నట్లుగా స్వీకరించగలగాలి. పోటీ ఎప్పుడూ ఉండకూడదు. నాదే పై చేయిగా ఉండాలి అని ఎపుడూ అనుకోకూడదు. స్త్రీ శక్తిమంతురాలని ఎపుడో అందరూ అంగీకరించారు. దానిని ప్రత్యేకంగా చూపించుకోవాలని చూడకూడదు. అన్నీ ఉన్న ఆకు అణిగి మణిగి ఉంటుంది.

ఈ ప్రపంచంలో ఎవరికిష్టమైన పనులు వాళ్ళు చేయవచ్చు. దానికి ఒక వాదమంటూ అవసరం లేదు. కానీ మీరేదో మీ వాదం ద్వారా ఈ భూప్రపంచాన్ని ఉద్ధరించేస్తామనీ, ఉద్ధరించాలనీ చూడకండి. దానికి 'సేవ' అని పేరు పెట్టకండి. ఒకరిని ఒకరు ఎన్నటికీ ఉద్ధరించలేరు. ఎవరిని వారు ఉద్ధరించుకోవలసిందే !!

ఈ ప్రపంచంలో ఎవరూ మిష్టర్ పర్ఫెక్ట్ లు కారు. దేవుళ్ళలో కూడా లోపాలున్నాయి. మీ సమస్యకి మీ భాగస్వామి కారణం కాదు. ఎవరికీ ప్రత్యేక వాదాలు అక్కర్లేదు. ఒక్కటే వాదం ఉండాలి. అదే మానవతావాదం.

ఒక మనిషిని మనిషిగా గుర్తించడం, మనిషిని మనిషిగా బ్రతకనివ్వడం, ఒక మనిషిని తన మనసుకు నచ్చిన పనిని చేసుకోనివ్వడం, సాటి మనిషిని గౌరవించడం, ధర్మ, అర్థ, కామ, మోక్షాల సాధనకై ప్రయత్నించడం మానవతా వాదం.

13 comments:

ఆకాశరామన్న said...

స్త్రీవాదమూ, పురుషవాదమూ అన్నీ సమాజములోని అసమానతలకు ప్రతిఫలాలు.

అసలు స్త్రీకి మగాడితో పనేముంది. ఆర్థిక స్వాతంత్రముంటే చాలు. పురుషునితో అవసరము లేకుండా బతికేయగలదు అని స్త్రీవాదులు అంటుంటారు కదా. అలానే పురుష వాదులూ అంటున్నారు. పెళ్ళితో పనేముంది, వేశ్య ఉంటే చాలు కదా. ఆ ఒక్క అవసరం తీరితే, ఇక ఆడవారితో మిగిలిన వాటిలో పనేముంది అని. ఇలా అనే వాల్లలో 99% చక్కగా పెల్లి చేసుకుంటారు. ఎంచక్కా కాపురాలు చేసుకుంటారు. కాకపోతే, మగాడి అవసరము లేకుండా ఆడాది బతకలేదు అనే అంశాన్ని ఛాలెంజు చేయడానికి ఇలాంటివాటిని ఆడవారు వాడుకుంటారు, ఆ సుఖం కోసం, భార్య చెప్పిన ప్రతీ దానికి తలాడించాల్సిన ఖర్మ నాకేం లేదు అని చెప్పుకోవడానికి మగాడు ఇలాంటి వాటిని వాడుకుంటాడు.

ఆడా ఒకరి మీద ఒకరు ఆధారపడి బతికే వ్యక్తులు. ఇదే నిజం. పైన చెప్పిన క్యాటగిరీ జనాలకు కూడా తెలిసిన నిజం.

Anonymous said...

"ఆడవాళ్ళని మగవాళ్ళెందుకు పోషించాలి ?"

This is a very sensible question in this age of gender equality. When women are free from the responsibility of feeding men, even men should be free from this responsibility. కలిసి కాపరం కాపరం చేస్తున్నా ఎవరిని వారే పోషించుకోవాలి. లేదా పోషిస్తున్నవారు కేవలం ప్రేమతో సేవాదృక్పథంతో పరోపకారంతో తమని పోషిస్తున్నారని పోషించబడేవాళ్ళు గుర్తించాలి. పోషించడం ఒక బలాత్కార చర్య కాకూడదు.

Praveena said...

chala baga chepparu..".స్త్రీ అబల అన్నది నిన్నటి మాట ! నేడు స్త్రీ ఒక శక్తి."
http://alochanalu.wordpress.com/2011/01/24/%E0%B0%A8%E0%B1%87%E0%B0%9F%E0%B0%BF-%E0%B0%AE%E0%B0%B9%E0%B0%BF%E0%B0%B3-%E0%B0%AE%E0%B0%A8%E0%B1%8B%E0%B0%97%E0%B0%A4%E0%B0%82/
naa alochanalaku chala daggaraga anepinchinde. meeru chala chakkaga rasaru.

Mauli said...

ఫస్ట్ వ్యాఖ్య నాది కాకు౦డా చూడ౦డి ..మీ ఫ్యాన్స్ కి కోప౦ వచ్చేను :)

బాప్ రే ...ప్రతి ఒక్కరు చదవాలి

నీహారిక said...

ఆకాశ రామన్న గారు,
స్త్రీ పురుషులిద్దరూ ఒకరి కొకరు ఆధారపడి తీరాలి. అదే దాంపత్యాన్ని కలకాలం నిలుపుతుంది. ఎవరైతే దీనిని ఒప్పుకోరో వారికి పెళ్ళి చేసుకునే అర్హత లేదు. వారు నిరభ్యంతరంగా పెళ్ళి చేసుకోకుండా ఎవరినైనా ఉంచుకోవచ్చు.మళ్ళీ ఈ మాత్రం దానికి వాదాలెందుకు? వాదనలెందుకు ?

నీహారిక said...

అజ్జాత 1 గారు,
ఈ ప్రశ్న మాలిక పత్రిక లో చదివాకే ఈ చర్చని లేవదీసాను. స్త్రీని పోషించడం గురించి మాట్లాడుతున్నారా? లేక స్త్రీతో పాటు పిల్లలని కూడా పోషించడం గురించి మాట్లాడుతున్నారా? శారీరికంగా బలవంతుడు కాబట్టి పురుషుడు సంపాదించాలని స్త్రీ ఇంటిలో ఉండి పిల్లలని సంరక్షించాలనీ మన పెద్దలు ఒక విధానాన్ని అలవాటు చేసారు. కాలం మారింది, ఇపుడు స్త్రీలు ఇంట్లో ఉండటానికి ఇష్టపడటం లేదు. దానికి కారణం కూడా ఇదిగో మీలాంటి వారి మాటల వల్లే!! వాళ్ళు తమ కాళ్ళ మీద నిలబడాలని అందరూ చదువుకుని ఉద్యోగం వచ్చిన తరువాతే పెళ్ళికి సిద్ధ పడుతున్నారు. బలవంతంగా పోషించమని ఎవరూ అడుక్కోవటం లేదు. ఒక స్త్రీ చేసే పనికి తిండి పెట్టటం కూడా దండగ అనుకునే మగాడు బ్రతికి ఉండడం కూడా దండగే ! మా ఇంట్లో పని చేసే అమ్మాయి కూడా నెలకి 5000 రూ సంపాదిస్తున్నది. ఎవరండీ స్త్రీని ఊరికే కూర్చోబెట్టి పోషిస్తున్నది ?

నీహారిక said...

ప్రవీణ గారు,
మీరు నాకంటే చాలా బాగా రాశారు. మీ అభిప్రాయాలు చాలా బాగున్నాయి. ఎంత చదివినా ఎంత ఉద్యోగం చేసినా స్త్రీల మొదటి ప్రాధాన్యం ఇంటికే !!తర్వాతే ఏదైనా !!
ధన్యవాదాలు.

నీహారిక said...

మౌళి గారు,
ధన్యవాదాలు.

Anonymous said...

ప్రస్తుతం ఉన్న వ్యవస్థలో ఆడదాన్ని మగవాడు పోషించడం అతని నెత్తి మీద మోపబడ్డ ఒక బలాత్కార చర్య. ఏ చట్టం తీసుకున్నా ఇది స్పష్టంగా బయటపడుతోంది. ఆమెకు అతనంటే ఇష్టం లేకపోయినా, ఆమంటే అతనికి ఇష్టం లేకపోయినా, ఆమెకు చదువూ, ఉద్యోగమూ, ఆస్తీ అన్నీ ఉన్నా, ఆమెతో తెగతెంపులై పోయినా, విడిపోవడానికి కారణం ఆమె ప్రవర్తనే అని తేలిపోయినా ఆమెని అతడు జీవితాంతం పోషించాలని చెబుతున్నాయి చట్టాలు. అదే సమయంలో ఆడదాని చేత విడాకులు ఇవ్వబడ్డ మగవాడికి ఉద్యోగం లేకపోయినా, ఆరోగ్యం బాలేకపోయినా, ఆస్తీ పాస్తీ ఏమీ లేకపోయినా అతన్ని పోషించే బాధ్యత మాత్రం ఆడదానికి ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు. ఇది న్యాయమేనా ? ధర్మమేనా ? ఇదేనా సమానత్వం ? విడిపోయినప్పుడు పిల్లల మీద కూడా ఆడదానికే హక్కుందని చెబుతున్నాయి చట్టాలు. అటువంటప్పుడు మగవాడికీ ఏ హక్కులూ లేకుండా, ఏ గౌరవానికీ నోచుకోకుండా "ఊరికే వీళ్ళందరినీ పోషిస్తూ కూర్చోవడమే అతనికి మిగిలిన హక్కు" అన్నప్పుడు ఈ పోషించడం ఒక బలాత్కార చర్యేనని ఒప్పుకుంటారా ? ఒప్పుకోరా ? ఇది అమానుషమా కాదా ? మీరన్నట్లే వాదాలూ, ఇజాలూ పక్కన బెట్టి మానవత్వంతో నిజాయితీగా చెప్పండి.

ఈ అన్యాయానికి వ్యతిరేకంగానే పురుషహక్కుల కార్యకర్తలు పోరాడుతున్నారు. ఏం తప్పా ?

ఇప్పుడు ఫెమినిస్ట్ చట్టాలు వచ్చినట్లే భవిష్యత్తులో పురుషానుకూల చట్టాలు కూడా వస్తాయి. ఈ పరిణామాన్ని ఎవరూ ఆపలేరు.

నీహారిక said...

అజ్జాత 2 గారు,
మీరు రాసిన పోస్టులో కమెంట్స్ వ్రాసింది ఆయనే అంటే నమ్మలేకుండా ఉన్నాను. నేను ఆయనతో జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలను పోస్టు రాసాను చూడండి.

అజ్జాత 3 గారు,
మీరన్నది నిజమే అయినా ఏ స్త్రీ కూడా ఊరికే కూర్చుని నన్ను పోషించు అని అనడం లేదు. ఇద్దరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చి బాధ్యతలని పంచుకున్నారు. మీరన్నట్లు ఏ స్త్రీ అయినా తన హక్కులని దుర్వినియోగపరిస్తే మేమే ఊరుకోవడం లేదు. ఒక పురుషుడి హక్కులను కాపాడడానికి మీకన్నా మేమే ముందుంటాము. ఇందుకు విరుద్ధంగా జరిగిననాడు మేమే ముందుకు వచ్చి పురుషుల హక్కులను కాపాడుకుంటాము. అంత విచక్షణ లేకుండా వ్యవహరించడానికి మాకు మాత్రం కొడుకులు లేరా? అపుడు మేము అనుభవించమా? అందరికీ చెప్పేది ఒకటే ఏ ప్రత్యేక వాదం అవసరం లేదు. ఒకటే వాదం ఉండాలి అదే మానవతావాదం.

Anonymous said...

well said Niharika.

Anonymous said...

Good post Neeharika garu.

Yagna said...

హమ్మయ్య... ఐతే మీరు సమైక్యవాదే!!!

భార్యా భర్తలు కలిసుండాలంటున్నారు కాబట్టి, సమైక్యవాది అన్నాను... అన్యధా భావించవద్దని మనవి :)