Sunday, January 24, 2016

ముందుతెలిసినా ప్రభూ.....(విపస్యన ధ్యాన కేంద్రం నాగార్జున సాగర్ )

విపస్యన ధ్యాన కేంద్రం నాగార్జున సాగర్  !

నాకయితే ధ్యానం అంటే ఇష్టం ఉండదు. ఒకచోట కూర్చుని మనసుని ఒకచోటే స్థిరపరచి శ్వాస మీద ధ్యాస పెట్టడం నాకు కుదరని పని. ఆలోచనలని ఆపడం కానీ ఒకచోట కూర్చోటం కానీ నేను చేయలేను, కానీ ప్రయత్నిద్దామని సాహసం చేసాను. నిజంగా సాహసమే !


ఇల్లు వదిలి పెట్టి ఎక్కడికైనా కొంత కాలం అందరికీ దూరం గా  వెళ్లిపోవాలని ప్రతి ఒక్కరికీ అనిపిస్తుంది. ఏకాంతం అంటే ఎక్కువమంది అనుకునేట్లు దుఃఖం కాదు. అదొక ప్రయాణం. మనతో మనం చేసే ప్రయాణం. ఇల్లు వదలపెట్టి వెళ్ళడానికి ముందు అడ్డు వచ్చేవి బాధ్యతలు. మనం లేకపోతే మిగతా అందరికీ కలిగే ఇబ్బంది. నిన్నటి వరకూ మనం పక్కన వుండి అన్నీ చూసుకుంటాం కొద్ది రోజులు కుటుంబ సభ్యులే ఆ బాధ్యత తీసుకోవాలి.మనకున్న మరో సమస్య. అన్నింటిని పట్టుకు వేలాడటం.


విపశ్యన అనేది ఒక ధ్యాన పద్దతి, దీనిని గౌతమి బుద్ధుడు వెలికి తీశాడు, ఇది అతి పురాతనమయిన  విద్య.  విపశ్యన అంటే ఉన్నది ఉన్నట్లుగా చూడటం. ఇది ఒక స్వయం పరిశీలన ప్రక్రియ, దీనిని ముందు ఆనాపాన ఉంటుంది.  అంటే ఏకాగ్రతకు సంబందించింది.  విపస్యన అంటే ఎలా వున్నదాన్ని అలాగే యథాతథంగా చూడటం. దీనివల్ల ప్రేమని, కోపాన్ని, ఆవేశాన్ని, ఆనందాన్ని అన్నింటిని సమభావంతో అర్ధంచేసుకోవటం, అనుభవం లోకి తెచ్చుకోవటం.

విపస్యన ధ్యాన కేంద్రాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి.వివరాలు లింక్ లో చూడండి.

ఒక్క నిమిషం స్థిరంగా కూర్చోలేని నేను రోజుకి పన్నెండు గంటలు కూర్చోటం అంటే సాహసం కాక మరేమిటి ? ఇష్టమయిన పని అంటే ఎన్ని గంటలయినా చేస్తాము కానీ మౌనంగా ఉండడం అదీ పది రోజులు అంటే ఎంత కష్టమో ఆలోచించండి. సాత్విక ఆహారం.....ఉదయం 4:30 నుండి రాత్రి 9:00 వరకూ ధ్యానం మధ్యలో కాస్త విరామం.


కొత్త సాధకులకు మొదట్లో చాలా కష్టంగా ఉంటుంది. నేనయితే వంకర్లు తిరిగాననుకోండి. ఈ శిబిరం ముగిసే సరికి నాకు కూర్చోడం మాత్రం వచ్చింది. శరీరానికి, మనసుకి ప్రశాంతత చిక్కింది, ఆలోచనల్లో స్పష్టత వచ్చింది. విద్యార్ధులకి, పని వత్తిడితో సతమతమయ్యేవారికి, ఏదైనా  సత్కార్యం  కోసం పని ప్రారంబించే వారికి ఈ ధ్యాన శిబిరం చాలా ఉపకరిస్తుందనడం లో సందేహం లేదు.ప్రశాంతమైన వాతావరణంలో గడపడం కోసం హిల్ స్టేషన్ కి వెళుతుంటాం కదా అలాగే ఇక్కడికి కూడా వెళ్ళవచ్చు.ఉచిత భోజనం, ఉచిత వసతి సౌకర్యాలు ఉంటాయి. మనకిష్టమైనంత (సాధన పూర్తయినవాళ్ళు మాత్రమే)దానం ఇవ్వవచ్చు కానీ బలవంతమేమీ లేదు. సాధన పూర్తయిన వాళ్ళు సేవకులుగా కూడా పనిచేయవచ్చు.

అక్కడ ఉన్నపుడు ఎవరి పన్లు వారే చేసుకోవాలి.ఒక్క మాట కూడా ఎవరితోనూ మాట్లాడకూడదు, తాకకూడదు, సైగలు చేయకూడదు, తలదించుకుని నడవాలి. సెల్ ఫోన్లు, విలువయిన వస్తువులు తీసుకురాకూడదు. స్త్రీలు గాజులు, గొలుసులు కూడా వేసుకోకూడదు. జీవహింస చేయకూడదు,బ్రహ్మచర్యాన్ని పాటించాలి, అబద్దం పలకకూడదు,మధ్యాహ్నం తరువాత భోజనం చేయకూడదు ,శరీర, ఇంద్రియ సుఖాలకు దూరంగా ఉండాలి. విలాసవంతంగా ఉన్న పడకలు వాడకూడదు.


ఇక్కడ గోయంక గారు చేసిన ప్రసంగాలను ప్రతి రోజు రాత్రి ఏడు గంటల కు వినిపిస్తుంటారు.  నాకు నచ్చనిది ఒక్కటే అక్కడ ఆడియోలో వినిపించే భాష. ఒక్కముక్క అర్ధం కాదు. వినడానికి కూడా బాగుండదు. సాయ బాబా హారతిలో నేను పాల్గొనడానికి ఇష్టపడకపోవడానికి కూడా కారణం అదే ...ఎక్కడో మరాఠీ భాషలో మనమెందుకు పాడాలి ? మన భాషలో సాయిబాబాని మనం కీర్తించుకోవచ్చు కదా ? అర్ధం కాని భాషలో మనం ఎంత పాడినా వ్యర్ధం కదా ?

బుద్ధుడు మనకు ఇచ్చిన అమూల్యమయిన ఈ నిధిని భారత దేశంలో వేదాలతో కలిపి భావితరాలకు అందిస్తే బాగుంటుందన్న ఆలోచన కలిగింది. వేదాలు అర్ధం కాకపోయినా వినడానికి బాగుంటాయి. మీకు ఎప్పుడైనా ధ్యానం అవసరం అనిపిస్తే మీకు దగ్గరలో ఉన్న విపస్యన  కేంద్రాన్ని సందర్శిస్తారని ఆశిస్తాను.  

7 comments:

అనంతమైన ఆలోచనలు said...

మంచి సమాచారం , నాకయితే అయిదు నిముషాలు కూడా ధ్యానం చేయటం అవట్లేదు [ఇప్పుడే నేర్చుకుంటున్నాను]

thinker said...

గోయంకా గారి ఉపదేశాలు, ఇంగ్లీషు లో కూడా దొరుకుతాయి, చాలా కాలం కిందట విన్నాను, దంపతులు ఇద్దరూ ఉంటారు, స్పీచ్ బాగానే ఉండేది కాని చాలా వీడియోలు ఉండటం అందులోనూ ప్రతి వీడియో నిడివి ఎక్కువ ఉండటం మూలాన మొత్తం చూడలేక పొయాను, పిరమిడ్ కెంద్రాలకు వెల్లి శ్వాస మీద ధ్యాస కోసం ప్రయత్నించాను, కాని ప్రతీ సారీ నిద్ర వచ్చేది, కొన్ని రోజుల తరువాత ధ్యాస అంతా నిద్ర మీదకు వెల్తోంది అని గ్రహించి ప్రయత్నంవిరమించుకోవడం జరిగింది.

Anonymous said...

Niharika garu nenu vipasana 10 day course ki vellali anukuntunna naku Konica doubts unnavi pls meramyna clear cheyagalara

నీహారిక said...

అన్ని వివరాలూ ఈ క్రింది లింక్ లో ఉన్నాయి. ఇంకా ఏదన్నా డౌట్ ఉంటే అడగండి. నాకు తెలిసినంత చెపుతాను.

http://www.dhamma.org/en/schedules/schnagajjuna

నీహారిక said...

@annonymous,

బుద్ధుడికి పూర్వం మనకు విగ్రహారాధన నేర్పారు.దాని గురించి మళ్ళీ ఎపుడైనా చెపుతాను.బుద్ధుడు నిర్గుణోపాసననే భోదించారు.

విగ్రహారాధన చేయకుండానే భగవంతుని ఆరాధించడాన్నే ‘నిర్గుణోపాసన’ అంటారు.
ఒక విగ్రహం ఉంటే పూజ పునస్కారాలూ చేయాలి కాబట్టి శుచిగా ఉండాలి.నిర్గుణోపాసనలో అవేవీ అవసరం లేదు కాబట్టి మనసు,బుద్ధి ఏకాగ్రత ముఖ్యమైనవి.

మనకి కంఫర్టబుల్ గా ఉంటే ఎటువంటి సమయంలోనైనా ధ్యానం చేయవచ్చు.ఎవరూ ఏమీ అభ్యంతరం పెట్టరు.మనం శుచిగా ఉంటే ఆలోచనలు కూడా మంచివే కలుగుతాయి.

మనస్సుని నిగ్రహించడం అనేదే ప్రధానం అయినపుడు అప్రధాన విషయాలపై మనసు వెళుతుందంటే ధ్యానానికి మనం ఇంకా సిద్ధం కాలేదన్న సంగతి మరువకూడదు.అన్నిటినీ వదిలించుకోవడమే ధ్యానం.మన శ్వాస మీదనే ధ్యాస ఉంచాలి.

Anonymous said...

"చాలా చిన్న వయసు అమ్మాయిలు భర్తలు పట్టించుకోవడం లేదనే కారణం తో ధ్యానం కోసం వచ్చారు" - ఈ అమ్మాయిల భర్తలు కూడా ఏదో బార్‍లో కూర్చుని మద్యోపాసన చేస్తూ స్నేహితులకి ఇలాంటి కంప్లైంట్లే చెబుతూ ఉండొచ్చు.

నీహారిక said...

:))