Friday, January 8, 2016

అన్నీ మంచి హేబిట్స్ ఉన్నాయంట నాలో.. విన్నావా మిస్టర్...


మా క్లాస్ లో తేజారాణి, వాగ్దేవి ఇద్దరూ ఫస్ట్ సెకండ్ వచ్చేవారని ఇదివరకు ఒక పోస్టులో చెప్పా కదా ?? వాళ్ళిద్దరూ ఆ రాంక్ ల కోసం ఒకటే పడి కొట్టుకునేవారు. వీళ్ళిద్దరికీ ఎంతసేపూ చదువుగోలే కానీ ఇంకో గోల ఉండేది కాదు. అసలు ఆ ర్యాంక్ కోసం ఎందుకు కొట్టుకునేవారంటే ఎవరికైతే ఫస్ట్ ర్యాంక్ వస్తుందో వాళ్ళే క్లాస్ లీడర్ అవ్వాలి అని ఒక రూల్, పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని తెలుసుకదా ... నాకసలే లీడర్ అవ్వాలని ఉండేది .... కానీ వాళ్ళీద్దరూ నన్నెక్కడ ఫస్ట్ రానిస్తారు. వాళ్ళే చచ్చిపోతుంటే ?? బుక్ మొత్తం బట్టీ కొట్టేసి గట్టిగా ప్రయత్నిస్తే స్లిప్ టెస్ట్ లో మాత్రం ఒకసారి ఇద్దరం ఫస్ట్ వచ్చామనుకుంటా !! అది సరిపోదుగా !!

లీడర్ పనులేమిటంటే బోర్డ్ తుడవడం, డేట్, సెక్షన్, అటెండెన్స్ చెక్ చేయడం, బుక్స్ టీచర్ కి తెచ్చి ఇవ్వడం,స్లిప్ టేస్ట్ కండక్ట్ చేసినపుడు నోట్స్ అన్నీ కలెక్ట్ చేయడం వగైరా పనులు చేయడం ఉండేది. ముఖ్యంగా క్లాస్ లో టీచర్ లేనపుడు పిల్లలు అల్లరి చేయకుండా చూడడం వంటివి నాకు బాగా ఇష్టమైనవి. ఎందుకంటే పెత్తనం చేయవచ్చు కదా ??

ఫస్ట్ ర్యాంక్ రావడానికి ఈ పనులు చేయడానికి సంబంధం లేదు. కానీ ఫస్ట్ వస్తేనే లీడర్ అయ్యేది...మరి లీడర్ అవ్వాలంటే నీతిగా ఉంటే అయ్యేపనేనా ?? నా కోరిక తీరేదెలా ?? టెంత్ క్లాస్ అయిపోవస్తుంది నేను ఇంకా లీడర్ ని కాలేదు. అసలే ఆల్జీబ్రా గుండె గాబరా !! ఎంత ప్రయత్నించినా 4 లేక 5 లోనే తిరుగుతున్నాను కానీ 1 మాత్రం రావడం లేదు. టెంత్ కాబట్టి అందరూ సీరియస్ గా చదివేవాళ్ళు. ఒకరోజు నాకు తిక్కలేచింది .... నాలోని అసలు నీహారిక ని బయటకి తీసాను. నీతి గా ఉంటే లాభం లేదు ఏదో ఒకటి చేసి లీడర్ని అవ్వాలని డిసైడ్ అయ్యా !!

క్లాస్ లో టీచర్ లేనపుడు మిగతా వాళ్ళందరినీ కెలకడం , ముచ్చట్లు, సినిమాలు చెప్పుకోవడం, గట్టిగా మాట్లాడడం, సైలెంట్ గా కూర్చోమన్నపుడు దబ్బున ఏదో ఒకటి పడెయ్యడం, క్లాస్ లో పని లేకపోయినా అటూ ఇటూ తిరగడం, విపరీతమైన శబ్దాలు చేయడం, బల్ల మీద డప్పు వాయించడం లాటివి చేయడం వల్ల కొద్దిగా అల్లరిపిల్ల గా గుర్తింపు తెచ్చుకున్నాను. అల్లరి చేసేవాళ్ళ లిస్ట్ లో మొదట నా పేరు ఉండేటట్లు చూసుకున్నాను. ఏదయితేనేమి ఫస్ట్ వచ్చానా లేదా ??

ఆగండి సుఖంతం అయిపోలేదు, ఇంకా ఉంది... అల్లరిలో ఫస్ట్ వచ్చాక అంతటితో నా కోరిక తీరుతుందా ఏమిటి? అల్లరిలో పెంకి అయిపోవాలని డిసైడ్ అయ్యా.... రోజూ క్లాస్ లీడర్ ని ఏదో ఒక రకంగా ఏడిపించడం మొదలుపెట్టాను. ఆమెకు విసుగు కలిగించేలా ఏడిపించాను, ఆమె క్లాస్ లో టీచర్ ప్లేస్ లో నిల్చున్నపుడు తను ఎలా నిలబడితే అలా నిలబడడం , సైలెన్స్ అంటే నేను కూడా సైలెన్స్ అనడం, నోటిమీద వేలు వేసి కూర్చోమంటే చిటికెనవేలు చూపి బయటకి వెళ్ళడం, ఆమె తలమీద చెయ్యి పెడితే నేను కూడా అలాగే తలమీద చేయి పెట్టడం, తను ఎలా నవ్వితే అలా నవ్వడం, తను ఎవరి పేరు పలికితే నేను కూడా అదే పేరు పలకడం లాంటివి చేసి ఆమెకి విసుగు తెచ్చేసాను. ఇక లీడర్ గా ఉండడం నా వల్ల కాదు అనేలా చేసాను.

సక్సెస్ ఫుల్ గా ఒకరోజు క్లాస్ లో అందరూ కలిసి టీచర్ కి నామీద కంప్లైట్ చేసారు. నేను వాళ్ళ మాట అసలు వినడం లేదనీ నన్ను కంట్రోల్ చేయడం కష్టం గా ఉందని అందరూ మొత్తుకున్నారు. ఆవిడ దీర్ఘంగా ఆలోచించి మళ్ళీ ఈసారి అలా చేస్తే హెడ్ మిస్ట్రెశ్ దగ్గరకి తీసుకెళతానని బెదిరించింది. నాకేమన్నా భయమా? పాడా?

మామూలుగా మనం హెడ్ మిస్ట్రెస్ ని కలవలేం కదా ఇలాగన్నా కలవచ్చు అని.... మనల్ని గుర్తుపెట్టుకుంటారు, మన ప్రతిభని ఆమె కూడా గుర్తిస్తే ఇంక కావలిసినదేమున్నది అని ఇంకా విజృంబించి పాటలు కూడా పాడడం మొదలుపెట్టా.. క్లాస్ అంతా సైలెంట్ గా ఉంటే ఎలాంటి పాటలు పాడానో తెలుసా .... వద్దులెండి జయమాలిని, హెలెన్ లు కలిపి పాడితే ఎలా పాడతారో అలా పాడానన్నమాట, క్లాస్ అంతా ఒకటే నవ్వులు. ఈ నవ్వులు చూసి ప్రక్క క్లాస్ లో క్లాస్ చెపుతున్న టీచర్ కి వళ్ళు మండుకొచ్చింది. ఆరా తీసింది అందరూ మనపేరే గొప్పగా చెప్పారు (కుళ్ళుబోతు మొఖాలు) పాట పాడితే ఎంజాయ్ చేయలేదూ ???

అంతే నండీ మంచికి రోజులు కావు. తిన్నగా హెడ్ మిస్ట్రెస్ దగ్గరకి తీసుకెళ్ళారు ... మహా ఇల్లాలు ... ఆవిడ అంతా విని .... దీర్ఘంగా ఆలోచించి నన్ను ఒక నెల రోజుల పాటు లీడర్ గా పనిచేయమని ఆర్డర్ పాస్ చేసింది. ఆనందం తోనూ, దుఃఖంతోనూ నాకు నోట మాట రాలేదు.

అలా అనుకోకుండా నేను ఎన్నో రోజులుగానో కలలు కంటున్న లీడర్ ని అయిపోయాను. ఆ తరువాత చూసుకోండి మా క్లాస్ అమ్మాయిలను ఒక్కళ్ళనయినా నోరు తెరవనిచ్చానా ??? అంతా కంట్రోల్ లో పెట్టేసాను. వాళ్ళకు తెలియదుగా నేనే కావాలని అల్లరి చేసానని. నీతిగా ఫస్ట్ రావాలంటే అయ్యేపనేనా ?? నేను నీతిగా ఉంటే లీడర్ని అయ్యేదాన్నా ?? అడ్డదారులు తొక్కాను. నాక్కావలిసినది సాధించుకోవాలంటే తప్పలేదు నాకు. పనులు చేయడానికి ఫస్ట్ రావడానికీ సంబంధం లేదు. ఫస్ట్ వస్తేనే లీడర్ ని చేస్తాననడం వాళ్ళ తప్పు గానీ, లీడర్ అవ్వడం కోసం నేను అడ్డదారులు తొక్కడం తప్పా??

Published on  20 Aprl  2012.

3 comments:

Anonymous said...

"HaiHai Nayaka" movie re-release chesinattundi, movie choodaka pothe oka saari choodandi, chimpi chaata chesaaadu aa cinema lo meelaanti budugu okadu.

Raaju

శ్రీనివాస్ కె said...

మనలో మనమాట... కొంపతీసి ఆ ట్రిక్స్ బ్లాగుల్లో కూడా ప్రయోగించడం లేదు కదా

నీహారిక said...

:p