Monday, December 9, 2019

బాలమిత్ర కథలో చదివా పగడపు దీవులు ఉంటాయని ....(Andaman And Nikobar Island Tour -1)

పగడపు దీవుల్లో పగడపు దిబ్బల(coral reefs) గురించి చదువుకున్నప్పటి నుండి అండమాన్ చూడాలని కోరుకుంటే ఇప్పటికి కుదిరింది. అండమాన్ అనగానే బీచ్ లు గుర్తొస్తాయి. మావారికి బీచ్ లు అంటే అసలు ఇష్టం ఉండదు. నేనడుగుతున్నానని బయలుదేరారు కానీ టూర్ గురించి అసలు ప్లాన్ చేయలేదు. కొలీగ్స్ మీద వదిలేసి బయలుదేరాం. ఏవేవి చూడాలో నేను కొంత ప్లాన్ చేసాను కానీ నా మాట విననే లేదు. టూర్ సరిగా ప్లాన్ చేయకపోవడం, వాతావరణం అనుకూలించకపోవడంతో ఓడలో ప్రయాణం కాన్సిల్ అవడం వల్ల అనుకున్నట్లుగా కోరల్ రీఫ్స్ చూడలేకపోయాము. 

నేను స్క్యూబా డైవింగ్ చేయాలని ప్రయత్నించినప్పటికీ మావారు పడనీయలేదు... అదొక నిరాశ. కోరల్స్ మరియు స్క్యూబా డైవింగ్ లేని అండమాన్ ప్రయాణం నాకు నచ్చలేదు. ఇంక వ్రాసేందుకేముంటాయి ? మిగతా విశేషాలు గుర్తుగా ఉంటాయని వ్రాస్తున్నాను.

అండమాన్‌ దీవులు మనకు చాలా దగ్గరలోని అందమైన  ప్రదేశం. అండమాన్-నికోబార్ దీవులకు వెళ్లాలంటే ముందుగా రాజధాని పోర్ట్‌బ్లెయిర్ చేరుకోవాలి. కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్ ల నుంచి రోజూ పోర్ట్‌బ్లెయిర్‌కు విమాన సర్వీసులు ఉన్నాయి.


  
హైదరాబాద్ నుండి పోర్ట్‌బ్లెయిర్‌కు రెండు గంటల ఇరవై నిమిషాల ప్రయాణం. విశాఖపట్నం, చెన్నై, కోల్‌కతాల నుంచి ఓడలో రెండున్నర నుంచి మూడురోజుల ప్రయాణంతో పోర్ట్‌బ్లెయిర్ చేరుకోవచ్చు. సముద్రం నీళ్ళను చూస్తూ గంటలు గడపడం కాస్త బోరింగ్ అని నా అభిప్రాయం. ఓడలో వెళ్ళదలుచుకుంటే ఎక్కువ మంది ఉన్నపుడు కలిసి వెళితే బాగుంటుంది. 

పోర్ట్ బ్లెయిర్ కి వెళ్ళాక చుట్టుప్రక్కల దీవులకు వెళ్ళాలంటే ఎలాగూ చిన్న ఓడలో ప్రయాణం చేయవలసి ఉంటుంది కాబట్టి మనకు ఓడ ప్రయాణం కోరిక కూడా తీరిపోతుంది. 




గంట, గంటన్నర వ్యవధిలో చిన్న చిన్న బోట్లలో ప్రయాణం చేస్తాం. ఈ బోటులో 200 వందల మందితో పాటు బస్సులు, వ్యాన్ లు లారీలు కూడా ఎక్కించారు. ఈ బోటులో వెళ్ళేటపుడు సరదాగా అనిపించింది.

మిగతా వివరాలు తరువాత పోస్టులో ...



2 comments:

విన్నకోట నరసింహా రావు said...

తతిమ్మా విశేషాల కోసం ఎదురుచూస్తాం గానీ అండమాన్స్ కు ఓడప్రయాణం చెయ్యలేకపోయానని మరీ బాధపడిపోకండి. ట్రావెలేజంట్లు బైటకు చెప్పినంత గొప్పగా ఉండదనీ, అసౌకర్యమే ఓ పాలు ఎక్కువనీ గతంలో ఎక్కడో చదివినట్లు గుర్తు. ఇప్పుడు మీకోసం ఆ వ్యాసాన్ని మళ్ళీ వెతికి పట్టుకున్నాను; ఈ క్రింది లింకులో చదవండి. ఆకాశమార్గాన ప్రయాణించి మంచి పని చేశారు మీరు.

అండమాన్లకు సముద్రప్రయాణంలోని సాధకబాధకాలు

నీహారిక said...

అవునండీ ట్రావెల్ ఏజెంట్లు కొంత అసహనానికి గురిచేసినమాట వాస్తవం. ధన్యవాదాలు వీ ఎన్ ఆర్ గారు !