Tuesday, December 10, 2019

సెల్యులార్ జైల్ (Andaman And Nikobar Islands - 2)

మొదటిరోజు పోర్ట్ బ్లెయిర్ చేరుకున్నాక ఫ్రెషప్ అయి ముందుగా సెల్యులార్ జైల్ కి వెళ్ళాం.


బ్రిటీషు పాలనకి వ్యతిరేకంగా పోరాటం చేసినవారిలో చాలామంది ఉద్యమకారులని బంధించి అండమాన్‌ దీవుల్లో ఖైదీలుగా వుంచేవారు. ఈ ఖైదీలందరూ ఈదుకుంటూ దేశానికి తిరిగొచ్చే సాహసానికి ఒడిగట్టడంతో సెల్యులార్‌ జైలు నిర్మాణం జరిగింది.


సెల్యులార్‌ జైల్‌కి 'కాలా పానీ' అనే పేరుంది. కాలా అంటే నలుపు. దీవుల్లో నిర్మించడంతోపాటు అత్యంత చీకట్లని అలుముకుని వుండే జైలు నిర్మాణం కారణంగా సెల్యులార్‌ జైల్‌కి ఆ పేరొచ్చింది.


బ్రిటీషువారికి వ్యతిరేకంగా నినాదాలు చేసే రాజకీయ ఖైదీలని ఎక్కువగా అండమాన్‌లోని ఈ జైలుకి తరలించేవారు.స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు వీర్ సావ‌ర్క‌ర్‌ను ఈ జైలులోనే ఉంచారు.


అండమాన్‌ దీవుల్లోని సెల్యులర్‌ జైల్‌ 1896-1906 మధ్య నిర్మించబడింది. ఒక చక్రం ఆకారంలో వుండే ఈ భవనంలో ఏడు విభాగాలుగా భవనాలని నిర్మించారు. ఈ భవనాలకి మధ్య భాగంలో ఒక టవర్‌ని ఏర్పాటు చేశారు.  ఈ సెల్యులార్‌ జైలులో టవర్‌ వద్ద నుండి ఖైదీలను గమనిస్తుంటారు.  ఏడు విభాగాలున్న ఈ జైలులో ఒక్కో విభాగంలో మూడంతస్తులుంటాయి.


ఏడు విభాగాల్లో మొత్తం 696 గదులని నిర్మించారు. ఈ గదుల్లో ప్రవేశించడం కూడా చాలాకష్టంగా వుంటుంది. ఒక్కో గదిలో ఒక్క ఖైదీని మాత్రమే వుంచేవారు.


ఏ ఖైదీ మరో ఖైదీతో మాట్లాడే వీలు లేకుండా వుండేలా జైలు గదులని నిర్మించారు. ప్రతి జైలు గది ప్రవేశ ద్వారం ఊచలు మరో ఖైదీకి కనిపించవంటే ఎంత జాగ్రత్త తీసుకున్నారో అర్థమవుతుంది.



ఏడు విభాగాలుగా వున్న ఒక్కో బ్లాక్‌ సెంట్రల్‌ టవర్‌కి అనుసంధానంగా వుండేలా ఒక బ్రిడ్జ్‌ని ఏర్పాటు చేశారు. జైలు అధికారులు మాత్రమే ఉపయోగించే ఈ బ్రిడ్జి ప్రవేశం రాత్రి సమయంలో మూసివేయబడేది. దీని ద్వారా ఒక్కో విభాగానికి రాకపోకలని పూర్తిగా నివారించబడేవి.


జైలు ఆవరణలోని ఒక్కో విభాగం వద్ద ఒక వర్క్‌షెడ్‌ వుంటుంది. ఇక్కడ అమర్చబడిన గానుగ పరికరాల్ని ఖైదీలే తిప్పాలి.


గింజల నుంచి నూనెని తీసేందుకే ఖైదీలు ఎక్కువగంటలు పనిచేయాల్సి వచ్చేది.


జైలు నుండి కొద్ది దూరం బయటికొస్తే చాలు నాలుగు పక్కలా సముద్రమే కనిపిస్తుంది.


దేశ స్వాతంత్య్రం అనంతరం అండమాన్‌ సెల్యులర్‌ జైలు ఒక చారిత్రక మ్యూజియంగా చరిత్రలో చిరస్మరణీయంగా వుండిపోయింది.


సాయంత్రం వేళల్లో అక్కడ లైట్ షో నిర్వహిస్తారు. సెల్యులార్‌ జైల్‌లో అప్పట్లో జరిగిన అరాచకాలను చూపించారు.



సాయంత్రం పోర్ట్ బ్లెయిర్ లోనే ఉన్న కోవే బీచ్ కి వెళ్ళడంతో మొదటిరోజు పూర్తయింది.





అందమైన హావ్ లాక్ బీచ్ కబుర్లు మరొకరోజు....

7 comments:

విన్నకోట నరసింహా రావు said...

చాలా చరిత్ర కలిగిన ప్రదేశాన్ని సందర్శించి వచ్చారు మీరు, అదృష్టవంతులు 👍. ‌‌ఈ జెయిల్ ఆవరణలో తిరుగుతున్నప్పుడు ఒళ్ళు గగుర్పొడిచిందా ... ఇంతటి చారిత్రాత్మక ప్రదేశాన్ని చూస్తున్నాననే స్పృహతో ??

నీహారిక said...
This comment has been removed by the author.
నీహారిక said...

నేను నాగార్జున సాగర్ దగ్గర 10 రోజులు విపశ్యన సెంటర్ కి వెళ్ళాను. అక్కడ కూడా అలాంటి సెల్ లాంటి నిర్మాణం ఉంది. అక్కడున్నన్ని రోజులూ ఒకరితో ఒకరు మాట్లాడుకోకూడదు. మాటా పలుకు లేకుండా 10 రోజులు గడపడం కష్టమనిపించింది.

ఉరిశిక్ష వేస్తే క్షణాల్లో చస్తారు. ఇలా బ్రతికి ఉండగానే జీవత్సవాల్లాగా బ్రతకడం నరకం. సెల్యులార్ జైల్ ని చూసాక మన జైళ్ళు కూడా ఇలాగే కట్టాలి అనిపించిందండీ.

దేశభక్తి అంటారా ? మనకు దొరకనిదాని గురించి ఎక్కువ ఆరాటపడిపోతాం...దొరికిన తర్వాత దానిని నిర్లక్ష్యం చేస్తాం.

citizen said...

Hi Madam,
may i know the tourist package /website/agent ?
Also, please give some details about budget madam,so that it may give an accurate idea to interested people.

The websites and travel agents are misleading.

నీహారిక said...

@ citizen Garu,

ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళాలంటే మనం ముందుగా కొంత హోం వర్క్ చేసుకోవాలి. అండమాన్ అఫీషియల్ వెబ్ సైట్ లో కొంత సమాచారం ఉంది. మాకు మనిషికి 25 వేలు ఖర్చు అయింది. ఫ్లైట్ చార్జెస్ తిరిగి వస్తాయనుకోండి.
ప్యాకేజ్ వాళ్ళు మనిషికి 12 వేలు తీసుకున్నారు. పోర్ట్ భ్లెయిర్ చేరుకున్నాక లోకల్ గా షిప్ లో తిరగవలసి ఉంటుంది. అవి ముందుగా బుక్ చేయాలి. వాటిని వాళ్ళే బుక్ చేసారు. మనం చేసుకుంటే కొంత మిగులుతుంది కానీ తెలియని ప్లేస్ కదా కొంత వదిలేయక తప్పదు. అండమాన్ వెబ్ సైట్ ద్వారా వివరాలు తెలుసుకుని ప్యాకేజ్ వాళ్ళతో పోల్చి చూసుకుని ఏది బెటర్ అయితే అలా చేసుకోండి. ధన్యవాదాలు.

నీహారిక said...

https://www.andamantourism.gov.in/

citizen said...

బాగా చెప్పారు, మేడమ్.
ధన్యవాదాలు.